రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటును రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు మూకుమ్మడిగా తిరస్కరించారు. సీఆర్డీఏ చట్ట సవరణ, ఆర్-5 జోన్ ఏర్పాటుపై 17 గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది. ఈ సభల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. అమరావతిని అభివృద్ధి చేయడానికి సీఆర్డీఏతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చర్యలుండాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్కాపురం, ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, వెలగపూడి, గ్రామసభల్లో రైతులు ముక్తకంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మంగళగిరి మండలం నీరుకొండ, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాల్లోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించారు.
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు సెంటు స్థలం ఆశ చూపి అమరావతి రైతుల పట్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల్లో విద్వేషం రగిలిస్తున్నారని రైతులు మండిపడ్డారు. భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వు చేసిన భూములను ఇతర అవసరాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
అన్ని గ్రామసభలు అరగంటలోపే ముగిశాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆర్-5 జోన్లో గతంలో సీఆర్డీఏ చట్టం ప్రకారం ఏముందో చెప్పాలని మహిళా రైతు కంభంపాటి శిరీష డిమాండ్ చేశారు