ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. ఈ కేసును సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి.
అలాగే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలను అటు మీడియా, ఇటు రాజకీయ నాయకులకు వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. ఒకవేళ వివరాలు లీకైతే సిట్ కు నేతృత్వం వహిస్తున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది.
దర్యాప్తుకు సంబంధించి పురోగతి నివేదికను ఈనెల 29న హైకోర్టు ముందు ఉంచాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయగా దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిమతమని బండి చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
మరోవంక, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు నిన్న ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి లకు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఒకవేళ నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ కు నిరాకరించింది.