రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఘర్షణలను పరిష్కరించుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జి-20 సదస్సులో ఇంధన భద్రత, ఆహారం అంశంపై మంగళవారం ఆయన ప్రసంగిస్తూ ఈ ఘర్షణలను ఆపేందుకు ప్రపంచ నేతలు కృత నిశ్చయంతో సమిష్టి కృషి చేయాల్సిఉందని చెప్పారు.
గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ పరిణామాలు, వీటితో ముడిపడి ఉన్న సమస్యలన్నీ కలిపి ప్రస్తుతం ప్రపంచ సంక్షోభాన్ని సృష్టించాయని ప్రధాని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో సంబంధాలు తెగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ప్రతి ఒక్క దేశంలోని సామాన్య పౌరుడు బాధపడుతున్నాడని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సంక్షోభం కూడా పెద్ద ఎత్తున నెలకొందని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో దేశాధినేతలందరూ ఏకమై సమస్యను పరిష్కరించాల్సిఉందని సూచించారు.
ఈ తరహా సమస్యలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి వంటి బహుళపక్ష సంస్థలు కూడా విఫలం అయ్యాయని, ఆ సంస్థల్లో అవసరమైన సంస్కరణలు తీసుకురావడంలో ప్రపంచ నేతలు కూడా విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న జి-20 సదస్సు పట్ల యావత్ ప్రపంచానికి చాలా ఆశలున్నాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
ప్రస్తుతం అనేక దేశాల్లో ఎరువుల కొరత నెలకొందని, అది భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారి తీయకుండా చూసుకోవాలని హితవు చెప్పారు. ఎరువులు, ఆహారధాన్యాల సరఫరా గొలుసును మరింత స్థిరంగా ఉంచేందుకు పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిఉందని స్పష్టం చేశారు.
‘‘రేపు ప్రపంచానికి ఆహార సంక్షోభం ఎదురైతే సమస్య నుంచి బయటపడేందుకు సరైన పరిష్కారం కూడా లేదు. అందుకే ఎరువులు, ఆహార ధాన్యాల సప్లై చైన్ సజావుగా సాగేందుకు మనమంతా ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ కు రావాలి. ఇండియాలో ఆహార భద్రత కోసం మేం సహజసిద్ధ వ్యవసాయాన్ని, పోషక విలువలు అత్యధికంగా ఉండే చిరు ధాన్యాలు వంటి సంప్రదాయ పంటలను ప్రోత్సహిస్తున్నాం. ఈ పంటలతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి నివారణతో పాటు పౌష్టికాహార లోపాన్ని కూడా నివారించవచ్చు. అందుకే వచ్చే ఏడాది మనం అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి” అని మోదీ పిలుపునిచ్చారు.
ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలనూ ప్రోత్సహించరాదని, ఎనర్జీ మార్కెట్ లో స్థిరత్వం ఉండేలా చూడాలని ప్రధాని సూచించారు. రష్యా నుంచి భారీ సబ్సిడీపై ఆయిల్, గ్యాస్‌ను ఇండియా దిగుమతి చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మోదీ పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా పలువురు దేశాధినేతల సమక్షంలో జి-20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది.