భారత్‌లో మొదటి ప్రైవేట్ రాకెట్ ‘‘విక్రమ్ ఎస్’’ ప్రయోగం విజయవంతమైంది. చెన్నైకి 115 కి.మీ దూరంలోని శ్రీహరికోట నుండి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. విక్రమ్-సబ్ ఆర్బిటల్ (వికెఎస్) ఈ ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది.
“విక్రమ్-ఎస్ గగనతలాన్ని అలంకరించిన భారతదేశపు మొదటి ప్రైవేట్ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ మహత్తరమైన సందర్భంగా మాతో ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’’ అని వికెఎస్ ఒక ట్వీట్లో ప్రకటించింది. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభించిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయికి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్-ఎస్’ అని పేరు పెట్టినట్లు వికెఎస్ తెలిపింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్’ అని నామకరణం చేశారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది.
శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 81 కిలోమీటర్ల ఎత్తుకు నింగి లోకి విక్రమ్ ఎస్ దూసుకెళ్లింది. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ హాజరయ్యారు.
విక్రమ్-ఎస్ రాకెట్.. సింగిల్ స్టేజ్ సబ్-ఆర్బిటల్ లాంచ్ వెహికల్ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్ మూడు పెలోడ్లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. ఒకటి విదేశీ సంస్థకు చెందినది కాగా.. రెండు మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్‌కిడ్జ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ‘ఫన్-శాట్’ పేలోడ్. దీనిని మన దేశంతో పాటు, అమెరికా, సింగపూర్, ఇండోనేసియా విద్యార్థులు రూపొందించారు.
అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ గతంలో వెల్లడించారు.