ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తమ నాయకులకు, వారికి సన్నిహితులైన వారికి నోటీసులు ఇస్తుండటం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర హైకోర్టుకు మరోసారి వెళ్లారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఫోన్ కాల్ లైవ్‌లో మాట్లాడిన తుషార్‌కు తొలుత నోటీసులు జారీ చేశారు. కాగా, శుక్రవారం) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) బీఎల్ సంతోష్‌కు కూడా నోటీసులు జారీ చేశారు.
అంతేకాకుండా తెలంగాణలోని ఓ బీజేపీ నేత బంధువు అయిన అడ్వొకేట్ శ్రీనివాసరావుకు కూడా నోటీసులు అందాయి. ఇక కేరళలో కొచ్చికు చెందిన జగ్గుస్వామికూడా సిట్ నోటీసులు జారీ చేసింది.
సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్ లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సంతోష్ కు అధికారులు సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ కేసులో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులను నిలుపుదల చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.