దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డితో పాటు బినోయ్ బాబును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా శనివారం ఈడీ విచారణకు కనికా రెడ్డి హాజరయ్యారు. జెట్ సెట్ గోకు సంబంధించిన వివరాలను ఆమె అందజేసినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయిన కీలక నిందితుడు శరత్ చంద్రా రెడ్డి భార్య ఆమె
. జెట్ సెట్ గో విమానాల్లో పెద్ద ఎత్తున డబ్బులు తరలించారన్న అనుమానంతో ఈడీ కనికారెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. బేగంపేట కేంద్రంగా ఈ పెద్ద ఎత్తున ముడుపులు చెల్లినట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసులో వినయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి కస్టడీని మరో 5 రోజులు పెంచుతూ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇలా ఉండగా, తమ విమానాల్లో ఎప్పుడూ డబ్బు, మద్యం తరలించలేదని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంను తమ కంపెనీ విమానాలకు ముడిపెడుతూ నిరాధార కథనాలు తీసుకువస్తున్నారని, దీన్ని తాను గట్టిగా ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. తన భర్త శరత్ చంద్రారెడ్డి అమాయకుడని, ఈ వ్యవహారంలో అతడి పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని కనికా రెడ్డి వెల్లడించారు.
కాగా, విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. వివరాల ప్రకారం..ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు సుమారు రూ.100 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది.
అలాగే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కలిసి లంచాలు ఇచ్చారు. హోల్ సెలర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు రూ.30 కోట్ల వరకు ఢిల్లీ పెద్దలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని రిపోర్ట్ లో తేలింది.
పాలసీ తయారికి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతికి వచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలను వాట్సప్ ద్వారా పంపించారని తెలుస్తుంది. అలాగే విజయ్ నాయర్ ఢిల్లీ ఉన్నతాధికారిగా చెప్పుకున్నట్లు సమాచారం.
కాగా గతంలో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఇప్పటికే తన రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. అయితే లంచాలు ఇవ్వడానికి వీరు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది.
ఈ స్కామ్ లో అరబిందో డైరెక్టర్ శరత్ చందా రెడ్డి, వినయ్ నాయర్, సమీర్ మహేంద్రో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఇందులో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. లిక్కర్ స్కామ్ బయటకు రాగానే ఈ 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది.