ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్‌షేక్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ విపత్తుల కారణంగా నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి మొట్ట మొదటిసారిగా సంపన్న దేశాలు అంగీకరించాయి.
విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోతున్న పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధిని ఏర్పాటు చేయాలని భారత్‌తో పాటుగా పలు దేశాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
ఇందుకోసం ఏటా ఏకంగా వంద బిలియన్ డాలర్లు వెచ్చిస్తామంటూ 2009లో సంపన్న దేశాలు చేసిన హామీని ఇప్పటికీ నిలుపుకోకపోవడంతో ఈ విషయంలో పలు దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అలాగే పలు అంశాలపై ఏకాభిప్రాయం మృగ్యం కావడంతో వాస్తవానికి శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారం కూడా కొనసాగింది.
అయినప్పటికీ పలు అంశాలపై పీట ముడి కొనసాగడంతో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. చివరికి ఆదివారం తెల్లవారుజాము సమయానికి పరిహార నిధి ఏర్పాటుపై ఒక అంగీకారం కుదిరింది.
పర్యావరణ మార్పులవల్ల తలెత్తుతున్న వరదలు, వర్షాభావం, కరవులు, హీట్ వేవ్‌లు, తుపానులు వంటి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలు అందుకు కారణమవుతున్న సంపన్న దేశాలు పరిహారం చెల్లించాలని దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాయి.\
ఆదివారం తెల్లవారుజామున కుదిరిన ఈ ఒప్పందం ఆ దేశాలకు విజయమనే చెప్పాలి. అయితే భూతాపానికి మూల కారణమైన శిలాజ ఇంధనాల వాడకం సమస్యకు మాత్రం ఈ ఒప్పందం ఎలాంటి పరిష్కారాన్ని చూపకపోవడం గమనార్హం.
‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలయినంత త్వరలో నిలిపివేయాలన్నది గత సదస్సులో నే చేసిన ఏకగ్రీవ తీర్మానం. అయితే ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి అంశాన్ని తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’ అంటూ వర్ధమాన దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్టు రూపొందించిన సంప్రదింపుల పత్రం నిస్సారమంటూ పలు దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్షాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ పలు దేవాలు విమర్శలు గుప్పించాయి.‘
1.5 డిగ్రీల లక్షం’తో పాటుగా యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన పలు ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక దశలో అ దేశాలు వాకౌట్ చేస్తామని కూడా బెదిరించాయి. దీంతో దిగివచ్చిన ఈజిప్టు సంప్రదింపుల పత్రంలో పెను మార్పులు చేసింది. ఈ పత్రంపై శనివారం రాత్రంతా చర్చలు జరిపిన అనంతరం ఎట్టకేలకు ఒక అంగీకారం కుదిరింది.
పర్యావరణ మార్పుల కారణంగా తలెత్తే విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదరడం చరిత్రాత్మకంగా భారత్ అభివర్ణించింది. ‘ దీనికోసం ప్రపంచం దీర్ఘకాలం వేచి చూసింది’ అని వ్యాఖ్యానించింది. ‘కాప్ 27’ సదస్సు ముగింపు ప్లీనరీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ జోక్యం చేసుకుంటూ అయితే కర్బన ఉద్గారాలు, గ్రీన్హౌస్ వాయువుల తగ్గింపు బాధ్యతల భారం రైతులపై పడకుండా చూడాలని అన్నారు. ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరేలా నిర్విరామంగా కృషి చేసిన మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం’ అని యాదవ్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడినుద్దేశించి అన్నారు.