ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్తులు జారీ చేయాలని కోరుతూ ఆ కేసులో ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. రామ చంద్రభారతి, కోరె నందు కుమార్, డీపీఎస్‌కేవీఎన్ సింహయాజి సంయుక్తంగా మంగళవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
నిందితులు జైల్లో ఉన్నందున సంతకాలు చేయకుండా వారి తరఫున లాయర్ కృష్ణ ఈ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ నెల 9న ప్రభుత్వం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏడుగురితో ఏర్పాటు చేసిన సిట్‌పై స్టే ఉత్తర్వులు జారీ చేయాలని నిందితులు తమ పిటిషన్లో కోరారు.
మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును సిట్‌కు బదిలీ చేయడం సరికాదని, సీబీఐ దర్యాప్తుకు లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్ విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగడం లేదు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే దర్యాప్తు జరుగుతోంది. సిట్ చీఫ్ ఆనంద్ కాబోయే డీజీపీ అనే విషయం అందరికీ తెలిసిందే. సీఎం చెప్పినట్లుగానే సిట్ ముందుకు వెళుతోంది. సంబంధం లేని వాళ్లకు సిట్ 41ఎ నోటీసులు ఇచ్చింది” అని తెలిపారు.
కేసు నమోదుకు ముందే పోలీస్ కమిషనర్ మొయినాబాద్ ఫాంహౌస్‌కు చేరుకున్నారని, టీవీ చానల్స్‌తో కేసు గురించి మాట్లాడారని పేర్కొంటూ ఈ పరిస్థితుల్లో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండదని స్పష్టం చేశారు. సిట్ కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుందనే విశ్వాసం లేదని, సిట్ దర్యాప్తుకు ముందే ప్రభుత్వ పెద్దలు కేసు గురించి మాట్లాడారని వివరించారు.
కేసుకు చెందిన సీడీలు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల హైకోర్టుల సీజేలకూ సీల్డ్ కవర్లో పంపించారని, వీటన్నింటినీ పరిశీలిస్తే సిట్ దర్యాప్తు స్వతంత్రంగా జరుగుతుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిందితులు పేర్కొన్నారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ ఉత్తర్వులు అందుబాటులోకి రాక ముందే ఇక్కడి హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలకు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని, తప్పుడు ప్రచారం మీడియాలో కూడా వచ్చిందని వారు చెప్పారు. ఆధారాలు లేకపోయినా బీజేపీ నేతలను సిట్ దర్యాప్తునకు పిలుస్తోందని, తక్షణమే సిట్ దర్యాప్తును నిలిపివేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని వారు ఆ అనుబంధ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు
ఇలా ఉండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ జరిపే విచారణకు ఆయన హాజరు కాలేకపోయారని హైకోర్టుకు బీజేపీ తెలిపింది. సిట్ జారీచేసిన నోటీసు ఢిల్లీ బీజేపీ ఆఫీసులో ఇచ్చారని, వ్యక్తిగతంగా సంతోష్‌కు అందలేదని పేర్కొంది. ఢిల్లీ పోలీసుల తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ హైకోర్టుకు ఈ విషయం చెప్పారు.
సంతోష్‌ను అరెస్టు చేయవద్దని తాము గతంలో ఆదేశించిన తర్వాత విచారణకు ఎందుకు హాజరు కాలేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ప్రశ్నించగా సిట్ విచారణకు ఆయన భయపడడం లేదని, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందువల్ల ఆయన హాజరు కాలేకపోయారని ప్రవీణ్ కుమార్ చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్, కరీంనగర్ అడ్వొకేట్ శ్రీనివాస్‌కు సిట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేసిన కేసులు, సిట్ దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, సిట్ వేసిన కేసులపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆర్డర్ గురించి హైకోర్టు వివరాలు కోరింది.
ఆర్డర్ కాపీ రాలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ చెప్పగా బుధవారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏజీ వాదిస్తూ, సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా సంతోష్ సహకరించడం లేదని తెలిపారు.
డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ వాదిస్తూ, సిట్ నోటీసును ఢిల్లీ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చారని, అక్కడున్న హేమేందర్ అనే వ్యక్తి నోటీసు తీసుకున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్ చూసిన తర్వాతే ఈ కేసుల్లో విచారణ ముందుకు వెళ్తామని పేర్కొన్న హైకోర్టు.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.