బహుభార్యత్వం, నిఖా-హలాలాపై దాఖలైన కేసులను పరిశీలిచేందుకు కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయా పద్ధతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తాజాగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ ధర్మాసనం ఎదుట న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ముస్లింల బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి ప్రకటించాలని పిటిషన్లో కోరారు.
జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తా ధర్మాసనం పదవీ విరమణ చేసిందని, కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశ్విని ఉపాధ్యాయ సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొత్తగా బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది.
మరోవైపు నిఖా-హలాల, బహుభార్యత్వం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంను ఆశ్రయించింది. పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇవి ఏర్పడ్డాయని, వీటి చట్టబద్ధతను ప్రాథమిక హక్కుల పేరిట ఎవరూ ప్రశ్నించజాలరని ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది.
తమ విశ్వాసాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క ముస్లిమేతరులనూ అనుమతించరాదని కోర్టును కోరింది. ఇస్లాం నియమాల ప్రకారం.. విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఆ భర్తకు విడాకులైనా ఇవ్వాలి. లేదంటే అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసి ఉండడాన్ని ఇస్లాం అంగీకరిస్తుంది. గతంలో ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.