యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో పాటు ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గుజరాత్ బీజేపీ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం భూపేంద్ర పటేల్ మేనిఫెస్టో విడుదల చేశారు. సంఘ విద్రోహశక్తులు పని పట్టేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్ కమిటీ సిఫారస్సును పూర్తిగా అమలు చేయడంతో పాటు గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రానున్న 5 ఏండ్లలో రూ. 10,000 కోట్ల బడ్జెట్తో 20,000 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.
వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10,000 కోట్లు, నీటిపారుదల సౌకర్యాల కోసం రూ. 25,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షల విలువైన వైద్య బీమా, రాష్ట్రంలో మూడు మెడిసిటీలు, రెండు అత్యాధునిక ఆసుపత్రులను అభివృద్ధి చేయడం వంటి ఇతర వాగ్దానాలను పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
గుజరాత్ ప్రగతి కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడల గమ్యస్థానంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ ఎకానమీకి చేరుస్తామని, టెర్రరిస్టు సంస్థల స్లీపర్ సెల్స్, భారత వ్యతిరేక శక్తులను గుర్తించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా జెపి నడ్డా భరోసా ఇచ్చారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే వారి కోసం కఠిన చట్టం తెస్తామని, సంఘ వ్యతిరేక శక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
182 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 77 స్థానాలకు పరిమితమైంది.