మత స్వేచ్ఛ అంటే అందులో ఒక ప్రత్యేక మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు ఏదీ ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భయపెట్టడం, బెదిరించడం, కానుకలతో ప్రలోభపెట్టడం వంటి మోసకారి పద్ధతుల ద్వారా జరిగే మోసకారి మతమార్పిడులను నిరోధించాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం కేంద్ర హోంశాఖ అఫిడవిట్ సమర్పించింది.
దేశంలోని నిస్సహాయ వర్గాలకు చెందిన పౌరులను వ్యవస్థీకృతంగా, ఓ పద్ధతి ప్రకారం, తెలివైన రీతిలో జరిగే మోసకారి మతమార్పిడుల గురించి పిటిషనర్ అనేక ఉదంతాలను ఎత్తిచూపారని అఫిడవిట్లో పేర్కొన్నది. రాజ్యాంగంలోని 14, 21, 25 అధికరణాలను మతమార్పిడులు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ చేసిన వాదనను ప్రస్తావిస్తూ 25వ అధికరణంపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని హోంశాఖ గుర్తుచేసింది.
మత ప్రచారంలో మతమార్పిడి ప్రాథమిక హక్కు లేదనే స్పష్టీకరణ ఇచ్చిన తర్వాతనే రాజ్యాంగ సభ 25వ అధికరణాన్ని ఆమోదించిందని తెలిపింది. మతప్రచారం అంటే మతంలోని సూత్రాల్లోగల సానుకూల అంశాలను నలుగురికీ తెలిసేలా చేయడంగా మాత్రమే చూడాలని అంటూ, మతమార్పిడి హక్కు అందులో భాగంగా లేదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది.
మోసపూరితంగా, బలవంతం చేసి మతమార్పిడి చేయడం అనేది వ్యక్తి అంతరాత్మ హక్కును భంగపరుస్తున్నదని, దీనిని నియంత్రించే అధికారం రాజ్యం పరిధిలోనే ఉన్నదని కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు కేంద్ర హోంశాఖ తన అఫిడవిట్లో ఉదహరించింది.