భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ఆదివారమే ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కొద్దీ నెలల క్రితమే ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
దాంతో ఆసియా క్రీడల్లో పలు పతకాలు సాధించిన ఉష.. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఒలింపియన్‌గా, అంతర్జాతీయ పతక విజేతగా రికార్డు సృష్టించనుంది. అంతేగాక మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి స్పోర్ట్స్ పర్సన్‌గా కూడా ఆమె ఘనత దక్కించుకున్నారు.
ఇక, ఉపాధ్యక్ష పదవి (పురుషుల కేటగిరి)కి మాజీ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నాడు. ఈ పదవి నారంగ్ నామినేషన్ ఒక్కటే దాఖలైంది. ఇక మరో ఉపాధ్యక్ష పదవి (మహిళల కేటగిరి)కి మాత్రం రాజలక్ష్మి సింగ్, అలకనంద అశోక్ పోటీపడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఒలింపిక్ పతక రెజ్లర్ యోగేశ్వర్ దత్, వెటరన్ ఆర్చర్ డోలా బెనర్జీ పోటీలేకుండా ఎన్నికవనున్నారు.
కాగా, 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఉష.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష మెరిసింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఆమె 14 స్వర్ణాలతో పాటు 23 పతకాలు గెలుచుకుంది.