సమైక్య రాష్ట్ర విభజనపై సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విభజనపై దాఖలైన 27 పిటిషన్లపై విచారణ ప్రక్రియను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రారంభించింది.
పిటిషనర్ ఇన్ పర్సన్ గా ఉన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్ తన వాదనలు వినిపిస్తూ ‘విభజనకు ఎటువంటి విధాన ప్రక్రియను అనుసరించలేదు రాజ్యాంగ నిబంధనలు పాటించలేదు.’ అని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని ఆర్టికల్ 368 ఉంది కదా అని ప్రశ్నించారు.
ఉండవల్లి స్పందిస్తూ ‘వారు దానిని అనుసరించలేదు. కనీసం ఓటింగ్ కూడా నిర్వహించలేదు. ఎవరికి ఏం తెలియనివ్వలేదు. మొదటిసారి టీవి టెలికాస్ట్ నిలిపివేశారు. రాజ్యాంగంలో ఏనాడూ వినియోగించని 367 (3)న అమలు చేశారు. డివిజన్ చేయాలనే ఉన్న నిబంధనను పట్టించుకోలేదు. స్పీకర్ తలలు లెక్కపెట్టారు’ అని తెలిపారు.
పైగా, విభజనను ఏపి శాసనసభ, మండలి తిరస్కరించిన విషయాన్ని విభజన బిల్లులో కనీసం ప్రస్తావించలేదని అంటూ దేశంలో అంతకు ముందెన్నడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని చర్చకు వాతావరణం అనుకూలంగా ఉందా? అని ప్రశ్నించారు.
ఉందిని ఉండవల్లి బదులివ్వగా, అప్పుడు ఉద్విగ పరిస్థితులున్నాయని మరో న్యాయవాది శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ‘విభజన జరిగి ఎనిమిదేళ్లకు పైగా అయింది. రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు దానిని ఏం చేయలేం. అంతిమంగా మంచి, చెడు ఏం జరిగినా దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.’ అని చెప్పారు.
తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. దానికి వారం రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం తన కౌంటర్ సమర్పించాలని ఆదేశించింది.