ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. బుధవారం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు.
విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. పది సెల్ఫోన్లను కూడా కవిత డ్యామేజ్ చేసినట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం 36 మందికి చెందిన 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది. అమిత్ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ధ్వంసమైన 153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది.
గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.
బుధవారం ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.