గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడంపై జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక దరిద్రగొట్టు సినిమా అని, అసభ్యంగా తీశారు అంటూ లాపిడ్ వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో లాపిడ్ తాజాగా స్పందించారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన లాపిడ్ ఇఫీ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ఎవరినీ కించపరిచే, అవమానించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే అందుకు తనను క్షమించాలని కోరారు.
గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రదర్శించడాన్ని జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ ఫిలింమేకర్ అయిన నాదవ్ లాపిడ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో ప్రదర్శించిన 15 చిత్రాల్లో ఇదొకటి.
చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించడంపై నాదవ్ లాపిడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరకు భారత దేశంలో ఇజ్రాయిల్ రాయబారి కూడా సిగ్గులేని వాఖ్యలంటూ ఖండిస్తూ, భారత ప్రభుతుత్వాన్ని క్షమాణప కోరారు. ఈ నేపథ్యంలోనే లాపిడ్ తాను చేసిన వ్యాఖ్యలకు గానూ క్షమాపణలు కోరారు.
