సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం ఇచ్చారని ఓ మహిళా అధికారిపై కేసీఆర్ ప్రభుత్వం వేటు వేయడం పట్ల బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే కేసీఆర్ సర్కారుకి ఎంత గౌరవమో తాజాగా మీడియాలో వచ్చిన కథనం చూస్తే బాగా అర్ధమవుతుందని ఆమె ధ్వజమెత్తారు.
ఇన్చార్జి మేనేజరుగా ఉన్న ఓ మహిళ ఉన్నతాధికారి అనుమతితో నిజామాబాద్ జిల్లా మామిడి క్వారీకి చెందిన సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తుదారుడికి ఇచ్చారు. దాని ఆధారంగా దరఖాస్తుదారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన శాఖాధిపతి మహిళా ఉద్యోగిని ఇన్చార్జి మేనేజరు బాధ్యతల నుంచి తొలగించారని విజయశాంతి వివరించారు.
ఆర్టీఐ కింద ఒక గనికి సంబంధించిన సమాచారాన్ని పై అధికారి అనుమతితోనే ఇచ్చినప్పటికీ ఆమెను ఏడేళ్లుగా వేధిస్తుండటమే గాక, రెండున్నరేళ్లుగా జీతం కూడా చెల్లించడం లేదని ఆమె విమర్శించారు. ఈ బాధలు భరించలేక చివరికి వీఆరెస్ అడిగినా ఇవ్వకుండా ఆమెకు నరకం చూపిస్తున్నరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై ఆ మహిళా అధికారి మహిళా కమిషన్కు నివేదించినా దిక్కులేదని, అంతర్గత విచారణలో ఈ వేధింపులు నిజమేనని నిర్ధారణ అయినా… నిర్భయ చట్టం కింద కేసు నమోదై ఈ విషయం సాక్షాత్తూ సీఎం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగకపోవడం ఘోరం అంటూ విజయశాంతి మండిపడ్డారు.
పైగా ఆమెపైనే తప్పుడు ఆరోపణలు చేసి, విచారణకు మహిళా అధికారిని నియమిస్తామని లేఖ ఇచ్చి అందుకు విరుద్ధంగా చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్, డీజీపీ, డీవోపీటీకి సైతం ఈ విషయం తెలిసినా మిన్నకుండటం దారుణం అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్నే లెక్క చెయ్యని ఈ సర్కారు నుంచి ఇంతకంటే న్యాయం ఆశించడం అత్యాశే అవుతుందని విజయశాంతి పేర్కొన్నారు.