ఆంధ్రప్రదేశ్ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని ఎన్నారై ఆసుపత్రిలో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆయా ఆసుపత్రుల్లో రికార్డులను అధికారులు పరిశిలించారు. అలాగే ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు.
ఇటీవల తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలీజీలు, ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాలు కూడా మెడికల్ కాలేజీలో సీట్ల విషయంలో పెద్ద ఎత్తున డొనేషన్లు తీసుకున్నారనే ఆరోపణలతో సోదాలు చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగడం కలకలం రేపుతోంది.
అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలలో భాగంగా అధికారులు అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని, పలువురిని ప్రశ్నించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో వైద్యురాలుగా ఉన్న అక్కినేని మణి విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ను ప్రారంభించారు.
కాగా గతంలో మణి ఎన్నారై ఆసుపత్రిలో డైరెక్టర్ గా వ్యహరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు గుంటూరులోని ఎన్నారై ఆసుపత్రిలో సోదాలు చేపట్టారు. అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు.
కరోనా సమయంలో జరిగిన అవకతవకలు, అలాగే యాజమాన్య కోటా సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలతో దాడులు చేస్తున్నారు. ఇక మ్యానువల్ రశీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని తెలుస్తుంది.
ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపులో అలాగే బిల్డింగ్ నిర్మాణం విషయంలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిమ్మగడ్డ ఉపేంద్ర నాథ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాస రావు, నళిని మోహన్ రావు పై కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా నిమ్మగడ్డ ఉపేంద్ర నాథ్ ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి.