భారత రైల్వేలలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం మూడేళ్ల క్రితం తలపెట్టిన ప్రయివేట్ రైళ్లు ఇప్పట్లో కార్యరూపం దాల్చేటట్లు కనబడటం లేదు. 109 ప్రధాన రూట్లలో 151 ట్రైన్లను ప్రయివేట్ వారు నడిపేలా, అందుకు గానూ రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రణాళిక రూపొందించింది.
అందుకు తగ్గట్లుగానే దేశ, విదేశీలకు చెందిన 14 కంపెనీలు ఆసక్తి చూపించాయి. తీరా టెండర్లను పిలిచిన తర్వాత రెండు కంపె నీలు తప్ప మిగిలిన కంపెలన్నీ వెనక్కి తగ్గాయి. ఆ రెండు కంపెనీల్లోనూ ఒకటి భారత రైల్వేకే చెందిన ఐఆర్సిటిసి కాగా, మరో సంస్థ మెఘా ఇంజనీరింగ్.
దీంతో సరైన స్పందన రాలేదని ఏడాది క్రితమే ఈ టెండర్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రయివేట్ కంపెనీలను మరింతగా ఆకర్షించేలా తిరిగి టెండర్లను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్లకు సరైన స్పందన రాకపోవడంలో మొత్తం టెండర్ ప్రక్రియనే రద్దు చేశారు.
మొత్తం టెండర్ ప్రక్రియను రివాల్యూయేట్ చేసి మళ్లి కొత్తగా టెండర్లు ఇస్తామని గత ఏడాది డిసెంబర్లో రైల్వే మంత్రి అశ్విన్ వైష్టవ్ లోక్సభకు తెలిపారు. అయితే ఇంతవరకు టెండర్ ప్రక్రియను ప్రారంభించలేదు. దీంతో ఇప్పట్లో ప్రయివేట్ ట్రైన్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
మొదట్లో ఇచ్చిన టెండర్ ప్రక్రియ ప్రకారం ప్రయివేట్ కంపెనీలే రైళ్లు నడపడానికి కావాల్సిన అన్నింటినీ అంటే ఫైనాన్సింగ్, ప్రొక్యూరింగ్, అపరేటింగ్, మెయింటెనింగ్ చేసుకోవాల్సి ఉంది. రైలు పెట్టేల్లో 70 శాతం రేకులను భారత్లోనే తయారు చేయాల్సి ఉంది.
ఇందుకు గాను భారత రైల్వే శాఖ ప్రయివేట్ ఆపరేట్లకు 35 ఏళ్ల పాటు ఆదాయంలో రాయితీలు ఇస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ప్రయివేట్ కంపెనీలకు నచ్చలేదు. మరిన్ని రాయితీలు కోరుతున్నాయి. పైగా, ఇతర దేశాల్లో అన్ని చోట్ల ప్రయివేట్ రైళ్లు నడిపిన సంస్థలు నష్టాలనే మూటగట్టుకున్నాయి.