బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర నిర్వహించేలా నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలొస్తే పాదయాత్రకు బదులు బస్సు యాత్ర నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర చేపట్టి.. 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నామని ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ ఛార్జ్ మనోహర్ రెడ్డి తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా పాదయాత్ర శిబిరంలోనే సంజయ్ ఉదయం, రాత్రి వేళ్ళల్లో జిల్లాల నాయకత్వంతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు జనవరి నుంచి బస్సు యాత్రకు సంజయ్ సిద్ధమవుతున్నారు. సమయాభావంతో పాదయాత్ర కాకుండా 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
టీఆర్ఎస్కు దీటుగా అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం కమలం పార్టీ వేట మెదలు పెట్టింది. బలమైన అభ్యర్థులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆయా నియోజకవర్గాల్లో దూకుడు పెంచాలని నిర్ణయించారు. ఇంకోవైపు డా. లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి ముఖ్యనేతలు ప్రజల్లో విస్తృతంగా తిరగాలని బీజేపీ నిర్ణయించింది.
కాగా, నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన మహా సంగ్రామ పాద యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఆదివారం జిల్లాలోని చిట్యాల గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర తలవేద ఎక్స్ రోడ్డు, వెంగవాపేట్, మంజులాపూర్ గ్రామాల మీదుగా నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వరకు సాగింది. తాను షెల్టర్ తీసుకున్న చిట్యాల గ్రామానికి వచ్చిన దాదాపు 20 మంది అభిమానుల పిల్లలతో బండి సంజయ్ మమేకమయ్యారు. వారితో దాదాపు అరగంటకుపైగా మాట్లాడారు.
చదువుల్లో ఫస్ట్ రావాలని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే అందరికీ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. రెండు రోజుల క్రితం నందన్ గ్రామంలో ఓ పేద విద్యార్థికి సైకిల్కొనిస్తానని మాటిచ్చిన బండి సంజయ్ ఆదివారం సదరు విద్యార్థికి సైకిల్ అందజేశారు.
చదువుల్లో రాణించాలని సూచించారు. మార్గమధ్యంలో తల్వేద వద్ద బండి సంజయ్ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. నిర్మల్‌కు చెందిన గీత కార్మికులు సంజయ్‌ను కలిసి సమస్యలు వివరించారు. పాదయాత్రలో అభిమానులు, కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీంతో రోడ్డంతా కాషాయ మయమైంది.