జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించింది.
రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో దాదాపు 50 నగరాల్లో 200కుపైగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలు పలు సూచనలు చేశాయి. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ జి20 ప్రెసిడెన్సీలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘ఇది దేశానికి లభించిన గౌరవం. ఒక పార్టీ లేదావ్యక్తికి కాదు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. దీనిని విజయవంతం చేయడానికి మనమందరం సహకారంతో పని చేద్దాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన జి-20 అధ్యక్ష పదవిని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ సాధనతో పాటు, ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఉగ్రవాదానికి కొన్ని దేశాలు ఇస్తున్న మద్దతును ఈ సమావేశాల్లో లేవనెత్తాలని సూచించారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోయిన వారిని స్వదేశం రప్పించేందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. .
జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి తమకుఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. . ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్ని రకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
జి-20 సదస్సు సందర్భంగా దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలని టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో ఇండియా నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందని చెప్పారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలమని, వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన జరగాలని తెలిపారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడంతో అత్యుత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు.
డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ దేశం దశాబ్దాలుగా ఒక ప్రత్యేకమైన అలీన విధానాన్ని విదేశాంగ విధానంగా కలిగి ఉందని చెప్పారు. ఆ విధానమే ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. జి20 ప్రెసిడెన్సీకి ప్రపంచ దక్షిణాదికి వాయిస్‌గా నిలబడటం తమ వంతు బాధ్యతని చెప్పారు.
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మమతా బెనర్జీ (టిఎంసి), నవీన్ పటాుయక్ (బిజెడి), ప్రేమ్‌సింగ్ తమాంగ్ (ఎస్‌కెఎం), ఏక్నాథ్ షిండే (శివసేన-షిండే), జోరంతంగా (ఎంఎన్ఎఫ్), పలనిస్వామి (అనాుడిఎంకె), కె.ఎం. కాదర్ మొహిదీన్ (ఐయుఎంఎల్), పసుపతి కుమార్ పారస్ (ఆర్ఎల్జెపి), రాందాస్ అథ్వాలే (ఆర్పిఐ), హనుమాన్ బెనివాల్ (ఆర్ఎల్పి), కెఎం మణి (కెసి), తిరుమవలన్ (విసికె), హౌం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
అఖిలపక్ష సమావేశానికి దాదాపు పది పార్టీల వరకు గైర్హాజరు అయ్యాయి. టిఆర్ఎస్, ఎన్‌సిపి, ఎస్పి, బిఎస్పి, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జెడి, జెడియు, శివసేన (ఠాక్రే), ఆర్ఎస్పి, ఎంఐఎం, అపాుదల్, ఎస్ఎడి, ఎఐయుడిఎఫ్, జెఎంఎం తదితర పార్టీలు హాజరు కానట్లు సమాచారం.