వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ ఈ సారి వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తంగా రెపో రేటు 6.25 శాతానికి రెపో రేటు పెరిగింది.
ఆర్బీఐవడ్డీ రేట్లను పెంచడం ఇది వరుసగా ఐదో సారి కావడం గమనార్హం. ఇంతకుముందు మాత్రం 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా ఈసారి కాస్త తక్కువే పెంచి ఉపశమనాన్ని కల్పించింది. ప్రతి నెలా ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ లక్షిత పరిధి అయిన 6 శాతానికి మించి నమోదవుతున్న నేపథ్యంలో రెపో రేటును పెంచక తప్పట్లేదు.
కొంత కాలంగా ద్రవ్యోల్బణం లెక్కకు మించి నమోదవుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోతుంది. ఇక ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో.. ఈ భారాన్ని వెంటనే అన్ని బ్యాంకులు ప్రజలపై మోపుతాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి.
ఇవి గృహ, పర్సనల్, ఎడ్యుకేషన్, వాహన ఇలా అన్నింటిపై వర్తిస్తాయి. అయితే.. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇప్పటికే బ్యాంకులు ఆ విధంగా వడ్డీ రేట్లను పెంచే పనిలో ఉన్నాయి.
మరోవైపు ఆర్థిక మాంద్యం సంకేతాలు భయపెడుతున్నాయి. రానున్న 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీంతో ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే వడ్డీ రేట్లను పెంచుతున్నాయి ప్రపంచ దేశాలు. యూఎస్ ఫెడ్ తొలుత పెంచదా.. అదే బాటలో ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు పయనించాయి.