ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాయి. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలుపెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు ఒకే వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడం అనే ప్రధాన సమస్యను పరిష్కరిస్తుందని, ఓటర్ల జాబితాను చాలా వరకు ప్రక్షాళన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ బిల్లును సార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ మధ్య స్వల్ప చర్చ అనంతరం లోక్‌సభ సోమవారం ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. చాలా కాలంగా చర్చిస్తున్న వివిధ ఎన్నికల సంస్కరణలను ఈ బిల్లులో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు, వివిధ ఎన్నికల సంస్కరణలపై గుర్తింపు పొందిన అన్నిజాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలతో చర్చల అనంతరం ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనను కూడా ఆ వర్గాలు తమ వివరణతో పాటుగా పంచుకున్నాయి. ‘ఎన్నికల జాబితాలను మరింత మెరుగ్గా నిర్వహించడం కోసం ఎన్నికల జాబితాల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీలు కమిషన్‌ను కోరాయి’ అని ఆ ప్రకటనలో ఎలక్షన్ కమీషన్ పేర్కొంది.
సాధారణంగా ఓటరుగా నమోదు చేయడానికి అర్హుడైన వ్యక్తి చేసుకున్న దరఖాస్తు ఆధారంగా ఓటరు జాబితాలో ఆ వ్యక్తి పేరును రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునే వ్యక్తి దరఖాస్తుతో పాటుగా తన ఐడెంటిటీ కోసం స్వచ్ఛందంగా ఆధార్ నంబరు వివరాలు ఇవ్వడానికి ఈ బిల్లులో ఒక నిబంధన ఉంది.
అయితే ఆధార్ నంబర్ ఇవ్వలేదన్న కారణంగా ఏ దరఖాస్తును తిరస్కరించడం జరగదని ఆ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒకే వ్యక్తి పలు చోట్లు ఓటరుగా నమోదు చేసుకోవడం అనే ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి.
ఓటర్లు తరచూ తమ నివాసాలను మార్చడం, పాత ఓటును తొలగించకుండా కొత్త చోట ఓటరుగా నమోదు చేసుకోవడం కారణంగా ఈ సమస్య వస్తుంది. అందువల్ల ఒకే వ్యక్తి పేరు ఒకటికన్నా ఎక్కువ చోట్ల కనిపిస్తే ఆ పేర్లను తొలగించడం జరుగుతుంటుంది.
అయితే ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఒక వ్యక్తి కొత్తగా ఓటరుగా నమోదు కావడం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటర్ల జాబితా నమోదు సిస్టమ్‌ను తక్షణం అలర్ట్ చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.
దీనివల్ల ఓటర్ల జాబితాను చాలా వరకు ప్రక్షాళన చేయడంతో పాటుగా ఓటరు సాధారణంగా తాను ఎక్కడ నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలోనే ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.