అధికారంలోకి రాబోతున్నామంటూ ప్రచారం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఐదు సీట్లకు పరిమితం కావలసి రావడంతో ఒక విధంగా గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. అయితే ఈ ఫలితాలతో జాతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం ఆప్ కు లభించింది.
గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీకి అర్హత సాధించిందని చెబుతూ పదేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు. పదేండ్ల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని, జాతీయ పార్టీగా అవతరించిందని కేజ్రీవాల్ ప్రకటించారు.
‘‘గుజరాత్ ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. వాళ్లకు రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆప్ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఆప్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు” అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.కాగా, బీజేపీకి కంచుకోటలా ఉన్న గుజరాత్ ను ఛేదించడంలో తాము విజయం సాధించామని ఆయన సంతోషం ప్రకటించారు. రానున్న రోజుల్లో తాము అక్కడి నుంచి విజయం సాధించేందుకు ఇవాళ వచ్చిన ఫలితాలు బలమైన పునాదులు వేశాయని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
‘‘మేం ఎవరిపైనా విమర్శలు చేస్తూ గుజరాత్ లో విష ప్రచారం చేయలేదు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో తిట్ల రాజకీయమే జరిగింది. మేం అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నం. అభివృద్ధి గురించే ప్రజలతో మాట్లాడాం. అందుకే మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమైంది. అయినప్పటికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హతను సాధించింది.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
గోవాలో రెండు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. ఇవాళ వెల్లడైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఐదు స్థానాలను గెలుచుకుంది. మొత్తం ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఆప్ జాతీయ పార్టీకి హోదా సంపాదించింది.
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి. 1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్సభ స్థానాలు గెలువాలి.
2. ఏవైనా నాలుగు రాష్ర్టాల నుంచి 11 లోక్సభ సీట్లు (రెండు శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం మూడు రాష్ర్టాల నుంచి ఎన్నికవ్వాలి. 3. కనీసం నాలుగు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకొనే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.