బీఆర్ఎస్ సమావేశంలో ఒక్కరి మొహంలో కూడా నవ్వులేదని అంటూ అది పార్టీ ఆవిర్భావ సభలా లేదు.. సంతాప సభలా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పార్టీ పేరు జెండా నుంచి తెలంగాణ పేరు తొలగించారని, ఇక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయారని స్పష్టం చేశారు.
ప్రజా సంగ్రామయాత్ర కొనసాగిస్తున్న సంజయ్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలోమాట్లాడుతూ బీఆర్ఎస్ కాదు.. అది బందిపోట్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. లిక్కర్ స్కాం పక్కకు పోయేందుకే బీఆర్ఎస్ అంటూ నాటకాలు అని మండిపడ్డారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేటీఆర్ ప్రయత్నమని అంటూ రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ రగిల్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పెట్టిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లు చేయడమేనా? తెలంగాణ మోడల్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా అనేది దేశానికి చాటిచెప్పడమేనా? తెలంగాణ మోడల్ అంటే అని నిలదీశారు
విద్యుత్ రంగంలో హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ గా మార్చామనడంపై విమర్శలు గుప్పించారు. చినుకుపడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్‌గా మారిందనడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని.. పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బండి సంజయ్ విమర్శించారు.
ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అని టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారని ఆరోపించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు.. రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలని.. డబుల్ ఇంజన్ సర్కార్, కమలం వికసించాలని చెబుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు.