తన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అర్థరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. లోటస్ పాండ్ దగ్గరకు వెళ్లిన పోలీసులు.. దీక్షను భగ్నం చేసి.. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఐతే.. అక్కడ చికిత్స చేయించుకోవడానికి వైఎస్ షర్మిల నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. తిరిగి ఆమె ఇంటికి వెళ్లిపోగా, ప్రస్తుతం ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. షర్మిల పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి దగ్గర ఆందోళనలు చెయ్యకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
వైఎస్ షర్మిల రెండు రోజుల కిందట ఈ దీక్ష ప్రారంభించారు. శనివారం ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ టెస్ట్ చేసిన అపోలో డాక్టర్ చంద్రశేఖర్ షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందనీ… కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ అవుతోందీ.. ఇలాగే కొనసాగితే దీని ప్రభావం కిడ్నీలపై పడుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో అర్థరాత్రి వేళ పోలీసులు… ఆమెను ఆస్పత్రికి తరలించారు.