ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ప్రారంభించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 77,511 కోట్ల మేర రుణాలను మంజూరు చేయగా రూ. 33,100 కోట్ల రుణాల పంపిణీ జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా. ఘవత్ కరాడ్ రాతపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 31.14 లక్షల ఖాతాలకు రూ. 33,100.79 కోట్ల రూపాయణ ముద్ర రుణాల పంపిణీ జరిగిందని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు (పంట రుణాలు, కాలువలు, నీటిపారుదల, బావుల నిర్మాణం వంటి పనులు మినహా) చేపల పెంపకం, తేనెటీగల పెంపకం ఈ రుణాల పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు.
పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్, ఆగ్రో పరిశ్రమలు, డైరీ, ఫిషరీ, అగ్రి-క్లినిక్లు, వ్యవసాయ వ్యాపార కేంద్రాలు, ఆహారం, వ్యవసాయ ప్రాసెసింగ్, మొదలైన జీవనోపాధిని ప్రోత్సహించే లేదా ఆదాయాన్ని సమకూర్చే సేవలను కూడా ముద్ర యోజన పరిధిలోకి తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.
2017-18 నుంచి ఎగువ సీలింగ్ రూ. 10 లక్షల ప్రకారం ట్రాక్టర్లు, పవర్ టిల్లర్ల కొనుగోలు కోసం కూడా ముద్ర రుణాలను మంజూరు చేసినట్టు తెలిపారు. 2018-19 నుంచి వాణిజ్య ప్రయోజనం కోసం ద్విచక్ర వాహనాల కొనుగోలును కూడా ముద్ర పరిధిలోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.