బీహార్‌లో మద్యం పై సంపూర్ణ నిషేధం ఉండగా, కల్తీ మద్యం తాగి ప్రజలు మృత్యువాత పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చాప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాగేసి వచ్చారా? అంటూ ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలపై విరుచుకుపడడంతో దుమారం చెలరేగింది.
ఈ ఘటనపై బీహార్ అసెంబ్లీలో బుధవారం ప్రతిపక్ష బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు నిరసన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శాసన సభలో ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం నితీశ్ కుమార్ అసహనంతో విపక్షాలపై విరుచుకు పడ్డారు.
“ఏం జరుగుతోంది. అరవకండి. మద్యం సేవించి సభకు వచ్చారా ? మీరు చేస్తున్నది కరెక్టు కాదు. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు” అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహంకు గురైన ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలు సభ నుంచి వాకౌట్ చేశారు. నితీశ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపాయి.
దీనిపై కేంద్ర మంత్రి , బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ “ పదేళ్ల క్రితం నితీశ్‌జీ ఇలా చేయలేదు. ఇప్పుడు ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడంతో పాటు వయసు కూడా పెరుగుతోంది. అందుకే కోపం తెచ్చుకుంటున్నారు.” అంటూ ఎద్దేవా చేశారు.
నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ సహితం తీవ్రంగా మండిపడ్డారు. నితీశ్ కాలం ముగిసింది. ఆయన తన జ్ఞాపక శక్తిని కోల్పోయినట్టున్నారు. ఈ మధ్య తరచూ కోపం తెచ్చుకుంటున్నారు” అంటూ వ్యంగాస్త్రాలు గుప్పించారు.