సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు.
బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని నడ్డా జోస్యం చెప్పారు. ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా కేసీఆర్ అతిగా ఆలోచిస్తుండని ఎద్దేవా చేశారు. త్వరలోనే కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. కుటుంబవాదాన్ని వ్యతిరేకంచే వాళ్లంతా తెలంగాణలో బీజేపీతో కలిసిరావాలని నడ్డా పిలుపునిచ్చారు.
ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్? అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
‘‘బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నించారు. వాళ్లకు నేనొకటి చెప్పదల్చుకున్న.. ఇది ప్రజాస్వామ్యం.. దీనిలో ఇతరుల గొంతు నొక్కే ప్రయత్నం జరగకూడదు.. ఒకవేళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు నిలువుగా బొందపెడ్తరని కేసీఆర్ తెలుసుకోవాలి’’ అని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని పేర్కొంటూ చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామని నడ్డా స్పష్టం చేశారు.
గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణలో 4,996 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టామని చెబుతూ దళిత వర్గానికి కేంద్ర సర్కారు ఎంతో గుర్తింపు ఇస్తోందని.. పదుల సంఖ్యలో దళిత వర్గం వారికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రపతి స్థానాన్ని కూడా దళిత మహిళకు కేటాయించిన బీజేపీకే దక్కుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్ నెస్ సెంటర్ల పేర్లను బస్తీ దవాఖానాలుగా కేసీఆర్ మార్చేసిండని చెబుతూ ఒరిజినల్ ను డూప్లికేట్ గా మార్చడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. డూప్లికేట్ ఎవరో, ఒరిజినల్ ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు.
కాగా, కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను గెలిచానని అంతకు ముందు బండి సంజయ్ చెప్పారు. అవమానాలకు తాను భయపడనని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు.
పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెబుతూ బీఆర్ఎస్ కు సిద్దాంతం, ఎజెండా అంటూ ఏమీ లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకే బీఆర్ఎస్ ఏర్పాటని ఆరోపించారు.