బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అమితాబ్ ఒక లెజెండ్ అని, భారత దేశంకే ఒక ఐకాన్ అని ఆమె కొనియాడారు.
భారత సినీ పరిశ్రమకు, ప్రపంచ సినీ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారని ఆమె తెలిపారు. భారతరత్నకు అమితాబ్ అన్నివిధాలా అర్హుడని ఆమె చెప్పారు. కోల్ కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారికంగా కాకపోయినా.. బెంగాలీల గొంతును వినిపిస్తున్నామని, భారత రత్న అమితాబ్జీ అంటూ ఆమె నినాదం చేశారు. చిత్ర పరిశ్రమకు అమితాబ్ చేసిన సేవలు అనితరసాధ్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు.