ఈశాన్య భారత దేశ అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్న అవినీతి, పక్షపాతం, హింస వంటి వాటిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. షిల్లాంగ్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు.
ఫుట్‌బాల్‌లో ఎవరైనా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడితే వారికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తారని, అదే విధంగా గత ఎనిమిదేళ్లలో ఈశాన్యప్రాంతం అభివృద్ధిని అడుకున్న వారికి రెడ్‌కార్డ్ ఇచ్చామని చెప్పారు. ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని.. దేశంలోనే మొట్ట మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఈప్రాంతంలో 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఖతార్‌లో ప్రపంచ ఫుట్‌బాల్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుండగా, ఇక్కడ తాను ఫుట్‌బాల్ అభిమానుల మధ్య ఓ ఫుట్‌బాల్ మైదానంలో ర్యాలీ నిర్వహించడం యాదృచ్ఛికమని పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి శకం నడుస్తోందని ప్రధాని చెబుతూ ఏడు దశాబ్ధాల్లో గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఈ ఏడాది తాము రూ.7 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలు లేకుండా చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.6వేల కోట్ల విలువైన అభివఅద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. 2014కి ముందు ఈశాన్య ప్రాంతంలో వారానికి 900 విమానాలు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 1900కి పైగా విమానాలు నడుస్తున్నాయని గుర్తు చేశారు.
కృషి ఉడాన్ యోజన ద్వారా ఇక్కడి రైతులకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ సహాయం చేస్తోందని చెప్పారు. కాగా, గడిచిన ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ 50 సార్లు పర్యటించడం గమనార్హం.
అగర్తలలో రూ. 4350 కోట్ల ప్రాజెక్టులు
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు, ప్రధానమంత్రి అగర్తలాలో రూ.4,350 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. త్రిపుర సర్వతోముఖాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రారంభించిన ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్ర వృద్ధి పథానికి ఊతమిస్తాయని మోదీ తెలిపారు.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ అండ్ రూరల్ – పథకాల కింద రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం “గృహ ప్రవేశ్” కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. “గిరిజన సమాజపు మొదటి ఎంపిక బిజెపి. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో గిరిజన వర్గాలకు రిజర్వ్ చేసిన 27 స్థానాల్లో 24 స్థానాలను బిజెపెి గెలుచుకుంది. ఆదివాసీలకు సంబంధించిన అంశాలకు మేం ప్రాధాన్యం ఇచ్చాం’’ అని ప్రధాని తెలిపారు.