ఆఫ్ఘనిస్తాన్లోని మహిళల విద్య, ఉద్యోగాలపై తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇళ్ల నుండి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటుందని తెలిపింది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న అనంతరం చట్టబద్ధంగా శాంతియుత పాలనను అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ మహిళలపై ఆంక్షలను కఠినతరం చేస్తోంది.
మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖ రాశారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియావుల్లా హషిమి ఈ లేఖను ధృవీకరించారు. తాలిబన్ల నిర్ణయాన్ని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఖండించాయి. మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అందరి హక్కులను గౌరవించే వరకు తాలిబన్ అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యునిగా గుర్తింపు పొందుతుందని ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దేశ జనాభాలో సగభాగం వెనక్కి వెళ్లడంతో ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని హెచ్చరించారు.
మహిళల హక్కులను ఇది కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ రాయబారి బార్బరా వుడ్ వార్డ్ మండిపడ్డారు. నిషేధం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆదోళన వ్యక్తం చేశారని ఆయన ప్రతినిధి తెలిపారు. విద్యపై నిషేధం విధించడంద్వారా మహిళల, బాలికల సమాన హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశ భవిష్యత్తుపై వినాశకరమైన ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు హాజరైన మూడు నెలల అనంతరం ఈ నిషేధం విధించడం గమనార్హం. బోధన, వైద్యాన్ని చాలా మంది తమ కెరీర్‌గా ఎంచుకోవాలని ఆకాంక్షించారు.