కరోనా వైరస్ చైనాలో మరోసారి వేగంగా విజృంభిస్తోంది. ఓమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7 వేరియంట్ కు చెందిన నాలుగు కేసులు తాజాగా నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా గుజరాత్లో రెండు కేసులు, ఒడిశాలో రెండు కేసులు నమోదయ్యాయి. భారత్ లో బీఎఫ్.7 వెలుగు చూసినప్పటికీ.. కేసుల్లో పెరుగుదల లేదని కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ.. వ్యాప్తిలో ఉన్న వాటితో పాటు కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్ వంటి నగరాల్లో బీఎఫ్.7 వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ కారణంగానే చైనా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్ఫెక్షన్ బారిన పడకపోవడం, వ్యాక్సిన్ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వంటివి చైనాలో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఒమిక్రాన్ వేరియంట్ బీఏ5కు చెందిన ఉపరకమే బీఎఫ్.7. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ. అంతేకాకుండా రీఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్‌తో పాటు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్ ఇప్పటికే వెలుగు చూసింది.