తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విభేదాలతో రోడ్ న పడడంతో, వారిని సరిదిద్దటం కోసం వచ్చిన సీనియర్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ఉండగానే గాంధీ భవన్లో హస్తం నేతల కొట్లాటలను తలబడ్డారు. లోపల సీనియర్లతో దిగ్విజయ్ సింగ్ సఖ్యత గురించి చర్చలు జరుపుతుంటే, మరోవైపు జూనియర్లు బయట గల్లాలు పట్టుకున్నారు.
దిగ్విజయ్ సమక్షంలోనే గల్లాలు పట్టుకుని బూతులతో హోరెత్తించే స్థాయిలో కొట్లాటలు దిగారు. ఓయూ నేతలతో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగటంతో ఘర్షణ తలెత్తింది. చూస్తున్నంత సేపట్లో గాంధీ భవన్ పరిసరాలు జై కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్ నినాదాలతో పాటు బూతులతో దద్దరిల్లాయి. తమకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ అనిల్ కూమార్ను ఓయూ నేతలు చుట్టుముట్టారు.
ఈ గొడవ జరుగుతున్న సమయంలో.. ఇరు వర్గాలకు సర్ధిచెప్పేందుకు మల్లు రవి ప్రయత్నించారు. కానీ సర్ధి చెప్పటం ఆయన వల్ల కాలేదు. తమకు పదవులు రాలేదని అయిన తాము సర్ధుకున్నామని చెబుతూ సీనియర్లపై అనిల్ కుమార్ ఎలా ఆరోపణలు చేస్తారంటూ ఓయూ నేతలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
రెండు మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సీనియర్లపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దండయాత్ర చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీకి వస్తున్న ఫండింగ్ అంతా ఏం చేశారని.. ఈ కల్లోలానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డేనని అనిల్ కుమార్ ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
ఇన్ని రోజులుగా బ్యాక్ గ్రౌండ్లో నడిపిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ముసుగు తీసి బయటకు వచ్చారని.. ఆయనో పెద్ద ముసుగు వీరుడంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే.. ఓయూకు చెందిన ఎన్ఎస్యూఐ నేతలు గాంధీ భవన్కు వచ్చి ఆయనను నిలదీశారు. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా గల్లాలు పట్టుకునే స్థాయికి చేరుకుంది.
లోపల ఒకరి తర్వాత ఒకరు సీనియర్ నేతలతో దిగ్విజయ్ సింగ్.. మంతనాలు జరుపుతూ అందరి మధ్య సఖ్యత తీసుకొచ్చేందుకు ప్రయత్నాల పర్వం మొదలుపెడితే.. బయట మాత్రం జూనియర్లు ఇలా గల్లాలు పట్టుకునే పర్వానికి శ్రీకారం చుట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.