దేశంలో వంటనూనెల ఉత్పత్తిని పెంచుతూ దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్’ పథకం తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనకరమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు దేశంలో అనుకూలంగా భూమిలో 15 శాతం తెలంగాణలోనే ఉందని వెల్లడించారు.
2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వంటనూనెల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చి దేశీయంగా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చూస్తోంది.
ఈ క్రమంలో 2019-20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలని, అలాగే మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఈ పథకం మొత్తం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన నిధులను అందజేయాలని, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ. 8,844 కోట్లను ఖర్చు చేయనుందని తెలిపారు. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జెనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం తన వాటాగా రూ. 3,560 కోట్లు ఖర్చు చేయనుంది.
పామాయిల్ సాగుకు దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి అనుకూలంగా ఉంటే, అందులో 15% అనగా 4.36 లక్షల హెక్టార్ల భూమి తెలంగాణలో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలోని అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అనుకూలమైన భూమి ఉందని తెలిపారు.
రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ పథకం మార్గదర్శకాలను రూపొందించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. 17% ఎస్సీలకు, 8% ఎస్టీలకు లబ్ధి చేకూరేలా పథక రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ,ఎస్టీ రైతులకు కేటాయింపులు చేసేలా వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు.
దేశంలో వంటనూనెల అవసరాల కోసం భారత్ చాలా వరకు దిగుమతులపై ఆధారపడిన విషయం తెలిసిందే. వంటనూనెలను దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2020-21 సంవత్సరంలో రూ. 80,000 కోట్ల విలువ చేసే 133.52 లక్షల టన్నుల వంట నూనెలను భారత్ దిగుమతి చేసుకుంది.
భారత్ దిగుమతి చేసుకున్న అన్ని రకాల వంటనూనెలలో పామాయిల్ వాటా 56 శాతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం భారతీయ రైతులకు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు ప్రభుత్వ ఖజానాపై దిగుమతి భారాన్ని తగ్గిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు.