టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. చికిత్సకు అవయవాలు సహకరించకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కన్నుమూశారు.
నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన అన్ని రోల్స్ చేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. తెలుగు సినిమాల్లో కైకాల చేయని క్యారెక్టర్ లేదని చెప్పుకోవచ్చు. ఆరు దశాబ్దాల పాటు సినిమాల్లోనే జీవించి చిత్రసీమకు ఆయన అందించిన విజయాలు మరపురానివి. తెలుగు ఆడియెన్స్ చేత ఎస్వీఆర్ వారసుడిగా పిలిపించుకున్న కైకాల మరణం టాలీవుడ్‌కి తీరని లోటు అని చెప్పుకోవాలి. కైకాల మరణవార్తతో టాలీవుడ్ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. గుడివాడ, విజయవాడలో ప్రైమరీ ఎడ్యూకేషన్ పూర్తి చేసి.. అదే గుడివాడ కాలేజ్‌లో డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు కైకాల. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు.
కాలేజీ రోజుల్లోనే కైకాలకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వెండితెరకు హీరోగా పరిచయమైన కైకాల.. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేశారు. టాలీవుడ్ నట శిఖరం కైకాల సత్యనారాయణ. నవసర నటనా సార్వభౌమగా ప్రేక్షుకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు కైకాల.
కైకాల నటించిన బంగారు కుటుంబంకు నంది అవార్డు దక్కింది. కైకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇదే ఏడాది క్రిష్ణంరాజు, క్రిష్ణ వంటి వారిని కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో పెద్ద దిక్కును కోల్పోయింది.