ప్రముఖ నటుడు చలపతి రావు (78) ఆదివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో చలపతి రావుకు గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు. 1966లో ‘గూడచారి’ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆయన దాదాపుగా 600కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించారు.
చల్లిపతి రావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రిలో జన్మించారు. రెండు రోజల వ్యవధిలో కైకాల సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చలపతి రావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడు, నిర్మాతగా ఉన్నాడు. రాష్ట్రపతి గారి అల్లుడు, పెళ్లంటే నూరేళ్ల పంట, జగన్నాటకం, కడప రెడ్డమ్మ, కలియుగ కృష్ణుడు తదితర సినిమాలకు చలపతి రావు నిర్మాతగా వ్యవహరించారు.
నటుడు చలపతిరావు హఠాన్మరణం పట్ల జూ.ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. ‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కాగా, ఆది సినిమాలో ఎన్టీఆర్, చలపతిరావు కలిసి నటించిన సంగతి తెలిసిందే.
ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చాకా బుధవారం రోజున మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు రవి బాబు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కయాన్ని తన కుమారుడు రవి బాబు ఇంట్లోనే అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్ధీవ దేహాన్ని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అయన ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్ తన కుమారుడు రవి బాబు ఇంట్లో వుంటున్నారు.