త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో అధికార పార్టీ బీజేపీకి మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి, కొత్త పార్టీని పెడుతున్న ప్రకటించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
”కర్నాటక రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తా. మా పార్టీ కర్నాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఏయే నియోజకవర్గాల్లో పోటీచేస్తుందన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం.” అని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తాను గంగావతి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకున్నానని, ఓటు హక్కు కూడా అక్కడే ఉందని చెప్పారు. కాగా, రాష్ట్ర రాజకీయాల్లో నా అనుకున్న వారే తనను మోసం చేశారని చెబుతూ కష్టకాలంలో ఎవరూ తనకు అండగా రాలేదని వాపోయారు.
అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై బయటనున్న ఆయన తనను ఈ కేసుల నుండి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బైట పడవేయలేదని కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నది.