మహారాష్ట్రలో గత శనివారం ఆత్మహత్యకు పాల్పడిన యువ నటి తునిషా శర్మ (20) ‘లవ్ జిహాద్’ బాధితురాలని స్వయంగా ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తునీషా సహనటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ ను ఆదివారం అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టి, నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్నారు.
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సహితం `లవ్ జిహాద్’ ఫలితంగా ఆమె మృతి చెందినదని అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ దర్యాప్తులో వాస్తవం వెల్లడి కాగలదని భరోసా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్‌లో టెలివిజన్ ప్రోగ్రామ్ సెట్లోనే తునీషా శర్మ చనిపోయి ఉంది.
అలీ బాబా: దస్తాన్-ఇ-కాబూల్ అనే టెలివిజన్ సీరియల్లో తునీషా సహనటుడు షీజాన్ మహ్మద్ ఖాన్‌తో లవ్‌లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక.. తునీషా తల్లి ఫిర్యాదు ఆధారంగా షీజాన్ మహ్మద్ ఖాన్ తునీషా ఆత్మహత్యకు కారణమయ్యాడనే కేసు నమోదు అయ్యింది.
ఆ తర్వాత అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులోని ఎఫ్ఐఆర్ ప్రకారం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, 15 రోజుల క్రితం విడిపోయారని తెలుస్తోంది. కాగా, ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశోధించేలని, అన్ని రకాల పరీశీలించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామ్ కదమ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
‘‘ఆత్మహత్యకు దారితీసింది ఏమిటి, ఎందుకు? ఇది లవ్ జిహాద్ కేసునా? లేక ఇంకేమైనా సమస్య ఉందా? విచారణలో నిజం బయటపడుతుంది. కానీ, తునీషా శర్మ కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుంది. ఇది లవ్ జిహాద్ కేసు అయితే ఏ సంస్థలు బాధ్యులుగా ఉన్నాయి.. కుట్రదారులు ఎవరో కూడా పోలీసులు పరిశీలిస్తారు ”అని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ పేర్కొన్నారు.
ఇక.. తునీషా శర్మతో కలిసి నటిస్తున్న రెండో సహనటుడు పార్త్ జుట్షిని ఆదివారం పోలీసులు ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సంప్రదించారు. అయితే.. తునీషా చనిపోయినప్పుడు తాను అక్కడ లేనని, ఈ సమయంలో సెట్స్ కు దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు.
పోలీస్ స్టేషన్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ “పోలీసులు నన్ను విచారణ కోసం తీసుకువచ్చారు. కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగారు. ఇది ఆమె వ్యక్తిగత పరిస్థితి కాబట్టి, ఆమె, ఆమె సంబంధాలు ఎలా ఉన్నాయో నేను వ్యాఖ్యానించలేను” అని చెప్పారు.
చిత్రీకరణ సమయంలో టీ విరామం తీసుకున్నప్పుడు, 20 ఏళ్ల తునీషా శర్మ బాత్రూంలో ఉరేసుకుని తాడుకు వేలాడుతూ కనిపించింది.. ఆమె చాలాసేపటి నుంచి బయటకు రాకపోవడంతో అక్కడున్న వారు గమనించి బలవంతంగా తలుపు తెరవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
కాగా, తెల్లవారుజామున 1:30 గంటలకు, షూటింగ్ బృందం ఆమెను ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుందని,ఆమె సహోద్యోగులు చెబుతున్నప్పటికీ, అక్కడికక్కడే పోలీసుల తనిఖీలో సూసైడ్ నోట్ లభించలేదని తేలింది. ఆమె మృతిని హత్య, ఆత్మహత్య కోణంలో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.