క్రిస్మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యం పడిపోవడంతో, పలు నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 60 శాతం మంది మంచు తుపానుతో విలవిల్లాడుతున్నారు.
సుమారు ఏడు లక్షల మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు క్రిస్మస్ వేడుకల సమయంలోనూ విద్యుత్ కోతలకు గురయ్యారని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. మంచు తుపాను, క్రిస్మస్ సెలవుల కారణంగా అనేకమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని తెలిపింది. శనివారం 2,700 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయని, 6,400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది.
తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూర్క్ ఒక వార్ జోన్‌ను తలపిస్తున్నది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చల్లని గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది మృతిచెందారు.
పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు. న్యూయార్క్‌లో పరిస్థితి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నదని గవర్నర్ క్యాథీ హోచుల్ అన్నారు.
రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు. ఇక బఫెలో లోని కొన్ని ప్రాంతాలలో 2.4 అడుగుల మేర మంచు కురిసిందని, విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు.