సంస్కృతి పరిరక్షణ హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని ఆమె హితవు చెప్పారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైనా, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారైనా తన సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని చెప్పారు.
శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి మంగళవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థ క్యాంపస్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. హైదరాబాద్ ఐటి ఫార్మా సహా ఇతర రంగాల్లో పురోగతి సాధించిందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారు పట్టణ ప్రాంత జీవనం చూసి ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దని ఆమె విద్యార్థులకు సూచించారు.
రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని చెబుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రగతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అన్ని విషయాల్లో మనం అమెరికాతో పోల్చుకోవద్దని ఆమె వారించారు. భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, మతాలు, వైవిధ్యం అమెరికాలో లేవని ఆమె తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచే మానవీయ విలువలు నేర్పాలని రాష్ట్రపతి సూచించారు. భారతదేశంలో యవశక్తే దేశానికి సానుకూలమైన అంశమని చెప్పారు.
తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ దేశ మహోన్నత పదవిలో మహిళ ఉండడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఏదైనా చేయాలనే ఆలోచన విద్యార్థుల్లో రావాలని చెప్పారు.
తెలంగాణ చరిత్రను తెలియజేసేలా కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి తిలకించారు. అనంతరం హైదరాబాద్ శివారులోని సర్దార్ వల్లబారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీని ఆమె సందర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారులకు నివాళులర్పించారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపిఎస్‌లతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.