హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను కించపరిచేందుకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భద్రతలోనే హిందూ దేవుళ్లను కించపరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మాన్ని పాటించే వారిలో ఐక్యత లోపించటం వల్లే హిందూ దేవుళ్లను అవహేళన చేస్తున్నారని పేర్కొంటూ హిందువులందరూ సంఘటితం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు.
హిందూ దేవుళ్లను, ధర్మాన్ని హేళన చేసి మాట్లాడితే హిందూ సమాజం ఊరుకోదని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు నిర్వహించిన పడిపూజా కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సంజయ్ సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునేది హిందూ ధర్మం అని పేర్కొన్నారు.
హిందూ ధర్మం పాటించే వారిలో నిస్వార్థం ఉంటుందని.. అందరూ బాగుండాలని కోరుకుంటారని వివరించారు. అలాంటి గొప్ప హిందూ ధర్మాన్ని ఈరోజు హేళన చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొండగల్‌లో జరిగిన ఓ సభలో బహిరంగంగా అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ సభలో అందరి ముందు అయ్యప్పస్వామిని కించపరుస్తూ దారుణంగా మాట్లాడాడు.
భైరి నరేష్ వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వాముల ఫిర్యాదుతో నరేష్‌పై రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలాధారులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. నరేష్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. భైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేసి పరిగి సబ్ జైలుకు పంపించారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోరారు. పీడీ యాక్టు కూడా నమోదు చేస్తామని వెల్లడించారు.