హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ కావడం విశేషం.
ఆదివారం రోజున ఎస్సార్డీపీలో భాగంగా హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల ఈ ఫ్లై ఓవర్ ను రూ. 263 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు.
గచ్చిబౌలి నుండి మియాపూర్ కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీకి ఈ ఫ్లై ఓవర్ ద్వారా సులభంగా చేరుకునే విధంగా వెసులుబాటు దక్కనుంది. మజీద్ బండ రోడ్డు నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 401 మీటర్ల ర్యాంపు, కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వైపు 383 మీటర్ల ర్యాంపు నిర్మించారు.
ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తిచేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే మూడేండ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేసేది ఇంకా ఉందని.. కానీ చేసింది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
రాబోయే 50 ఏండ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు.గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు. వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్ ట్రీట్మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించబోతున్నదని చెప్పారు.