మధ్యాహ్నం 3 గంటల తర్వాత రోడ్లపై సవారీ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వాహనదారులను బెంబేలెత్తిస్తూనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆ సమయం అత్యంత ప్రమాదకరమని వాహనదారులను ఆ గణాంకాలు అప్రమత్తం చేశాయి.
అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ సురక్షితమని, ఆ సమయంలో 10 శాతం లోపు ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు వెల్లడించాయి. 2021లో నమోదైన 4.12 లక్షలకు పైబడిన ప్రమాదాల్లో 1.58 లక్షల ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగాయని భారత్లో రోడ్డు ప్రమాదాలు-2021 పేరిట ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రచురించిన వార్షిక నివేదిక పేర్కొంది.
ఇక సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకూ దేశవ్యాప్తంగా 21 శాతం ప్రమాదాలు జరిగాయని తెలిపింది. 3 గంటల నుంచి 6 గంటల మధ్య 18 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2021లో 4996 ప్రమాదాలు ఏ సమయంలో జరిగాయో గుర్తించలేదని ఈ నివేదిక తెలిపింది.
సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య తమిళనాడులో అత్యధికంగా 14,416 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, మధ్యప్రదేశ్లో 10,332 ప్రమాదాలు వెలుగుచూశాయని పేర్కొంది. 2017 నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటిలో 35 శాతం కంటే అధిక ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో జరిగాయి.