పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ (88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అదివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన చేతికి ఫ్రాక్చర్ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా డిసెంబర్లో స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు.
ఆయన ఆహారం తీసుకోవడం తగ్గించేశారు. మూత్ర విసర్జన కూడా తగ్గిపోవడంతో బలహీనపడ్డారు. తర్వాత ఆయనను ఐసియూకి తరలించారు. ఓ వారం రోజులుగా ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత త్రిపాఠీని ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు.
కేసరి నాథ్ త్రిపాఠీకి రెండు సార్లు కొవిడ్ వైరస్ సోకింది. కానీ ఆయన లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆయన 1934 నవంబర్ 10న అలహాబాద్‌లో జన్మించారు. ఆయన బీహార్, మేఘాలయ, మిజోరంలకు గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు వహించారు.
త్రిపాఠి ఆరు పర్యాయాలు ఉత్తర్‌ప్రదేశ్ శాసన సభ్యుడుగా ఉన్నారు. 1977 నుంచి 1979 వరకు ఆయన యూపీ సేల్స్ ట్యాక్స్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అలహాబాద్ హైకోర్టులో త్రిపాఠి సీనియర్ అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. రచయిత, కవిగా ఆయన అనేక పుస్తకాలు రాశారు.
కేషరీనాథ్ త్రిపాఠి పట్ల ప్రధాని నరేంద్ర మోడీసంతాపం తెలిపారు. “కేశరి నాథ్ త్రిపాఠికి రాజ్యాంగ సంబంధమైన విషయాలలో మంచి ప్రావీణ్యం ఉంది. యూపీలో బీజేపీని నిర్మించడంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర ప్రగతికి కృషి చేశారు. ఆయన మృతి చెందారని తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి” అని మోడీ ట్వీట్ చేశారు.
