శీతల గాలులతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు చలి మరోవైపు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడ్డ కట్టేంత ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలకు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం తెలిపింది. చలికి తోడు పొగమంచు అధికం కావడంతో వాతావరణ శాఖ దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్‌లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఆయా నగర్లో కనిష్ట ఉష్ణోగ్రత 2.6 డిగ్రీలుగా నమోదు కాగా, లోధి రోడ్లో 2.8 డిగ్రీల సెల్సియస్ , పాలంలో 5.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండి వెల్లడించింది. విజిబిలిటీ తగ్గినట్లు అధికారులు తెలిపారు.
చలి, పొగమంచు దెబ్బకు ఆప్ ప్రభుత్వం ఏకంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 15 వరకూ సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో విమానాలు, రైళ్ల షెడ్యూల్ ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా 42 రైళ్లు గంట నుండి ఐదు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే ప్రతినిధి తెలిపారు.
చలికి తట్టుకోలేక కాన్పూర్‌లో వారం రోజుల్లో ఏకంగా 98 మంది మృతి చెందారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చలిలో ఒక్కసారిగా రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున 60ఏళ్లు పైబడిన వారు బయటికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. మరోవైపు చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితులు కొనసాగవచ్చని ఐఎండి అంచనా వేసింది. భారత్ -గంగా మైదానాల మీదుగా తేలికపాటి గాలులు, అధిక తేమ కారణంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చంఢగీఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోందని ఐఎండి పేర్కొంది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సోం, త్రిపురలలో చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.