భక్తులకు బూజుపట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు ఇచ్చారంటూ ఆందోళన చేయడంతో పోలీసులు సోమవారం పోటు (ప్రసాదాల తయారీ కేంద్రం)ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాన్ని దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు.
దేవాలయ ఈవో సెలవులో ఉన్నప్పుడు, కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకుండా రావడమేంటని సర్కిల్ ఇన్స్పెక్టర్(సీఐ) నాగరాజుతో వాగ్వాదానికి దిగారు. లడ్డూల నాణ్యత పరిశీలనకు సహకరిస్తామని, పోటును సీజ్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేవస్థానం చరిత్రలోనే ఇలాంటి ఘటన తొలిసారి అని సిబ్బంది పేర్కొన్నారు.
ఓ దశలో సీఐ అప్పటికప్పుడు నోటీసును సిద్ధం చేసి, ఇచ్చేందుకు యత్నించారు. దాంతో టీఎన్జీవో నాయకులు రంగప్రవేశం చేసి సీఐ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారా? ప్రసాదాల్లో నాణ్యత లేదని నివేదిక ఇచ్చారా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాథమిక ఆధారాలేమీ లేకుండానే పోటును ఎలా సీజ్ చేస్తారని నిలదీశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తయారు చేసిన లడ్డూల్లో కొన్ని బూజు పట్టాయని తెలిపారు. ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నీలిమ లడ్డూ కౌంటర్ వద్ద ఓ భక్తుడు కొన్న లడ్డూకు బూజు పట్టినట్లు గుర్తించారని వివరించారు. ఆ క్రమంలో మరో భక్తుడు కూడా తనకు బూజు పట్టిన లడ్డూ వచ్చిందని చెప్పారని, న్యాయమూర్తి ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
న్యాయమూర్తి ఆదేశాలతో లడ్డూల నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపుతామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు. తనతో వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రసాదాల నమూనాలను సేకరిస్తారని చెప్పగా, దేవాలయ సిబ్బంది మరోసారి ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఆందోళన చేశారు. దేవాలయ ఈవో మంగళవారం విధులకు హాజరవుతారని, ఆయన సమక్షంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోవంక, బూజు పట్టిన లడ్డూల ఉదంతంపై విచారణకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. విచారణకు అదనపు కమిషనర్ జ్యోతి, భద్రాచలం ఆర్డీవో రత్న కల్యాణి, దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అధికారి రమాదేవిలతో కమిటీని నియమించారు.