హత్యాయత్నం కేసులో ఒక ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. స్థానిక కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడు కానుండటంతో హైకోర్టును ఆశ్రయించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఈ సంఘటన జరిగింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహ్మద్ ఫైజల్ 2014 నుంచి ఎంపీగా ఉన్నారు. 2009లో షెడ్ నిర్మిస్తున్న బంధువైన మహ్మద్ సలీహ్‌పై కొంత మంది వ్యక్తులతో కలిసి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సలీహ్ కొన్ని నెలలపాటు కేరళలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
కాగా, బంధువు మహ్మద్ సలీహ్‌పై దాడికి సంబంధించి ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌తోపాటు 23 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బెయిల్ పొందారు. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన కవరత్తి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
ఎంపీ ఫైజల్‌తో పాటు మరో నలుగురిని దోషులుగా పేర్కొంది. వారికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎంపీ ఫైజల్, ఇతరులకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో మహ్మద్ ఫైజల్ ఎంపీ పదవిని కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టును ఆశ్రయించనున్నారు.