మాజీ కేంద్ర మంత్రి, ఆర్జెడి నేత శరద్ యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి గురువారం (జనవరి 12) రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. ‘పాపా నహీ రహే: (నాన్న ఇక లేరు)’ అని ఆమె పోస్టు పెట్టారు.
శరద్ యాదవ్ 1999, 2004 మధ్య అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో పలు శాఖలను నిర్వహించారు. అంతకు ముందు విపి సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. 2003లో ఆయన జెడియు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ పార్టీకి చెందిన వారే. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నితీశ్ కుమార్ ఆయన రాజ్యసభ టికెట్ పొందడంలో సాయం చేశారు.
2009లో ఆయన మళ్లీ మాధేపురనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో జెడి(యు) ఓటమి తర్వాత నితీశ్ కుమార్‌తో ఆయన సంబంధాలు చెడిపోవడం మొదలైంది. 2017 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ మళ్లీ బిజెపితో చేతులు కలపాలని నిర్ణయించగా, శరద్ యాదవ్ ఆయన బాటలో నడవడానికి ఇష్టపడలేదు.
తర్వాత లోక్తాంత్రిక్ జనతాదళ్ పేరిట సొంత పార్టీ పెట్టారు. అయితే 2012లో తన పార్టీ ఆర్జెడిలో విలీనమవుతున్నట్లు శరద్ యాదవ్ ప్రకటించారు. శరద్ యాదవ్ మొత్తం 7 సార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
1947 జూలై 1న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శరద్ యాదవ్ జన్మించారు. విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే శరద్ యాదర్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ వ్యతిరేక గళం వినిపించారు. జేపీ ఉద్యమంలో చేరారు. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువకాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఐతే.. కాంగ్రెస్‌కి వైరిపక్షమైన లాలూప్రసాద్‌ని ఒకటి చేసి.. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటు చేయడంలో శరద్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శరద్ యాదవ్ అందించిన మద్దతును సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.