కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏండు హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఏపీ, తెలంగాణల మధ్య ఇకపై వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుందని మోదీ చెప్పారు. విలువైన సమయాన్ని ఆదా చేయడానికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ తోడ్పడుతుందని తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మన దేశంలోనే తయారు చేశామని చెప్పారు.
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని, కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ. 3 వేల కోట్లకు పైగా ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, గవర్నర్ తమిళి సై, తెలంగాణ మంత్రులు తలసాని, మహమూద్ అలీ హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైలుకు సంబంధించి ఛార్జీల వివరాలను అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రైల్వేశాఖ ఈ రైలు బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈనెల 16 నుంచి ప్రయాణానికి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ పేరుతో రెండు క్లాస్‌లు ఈ రైల్లో అందుబాటులో ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలుకు 20833, సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే రైలుకు 20834 నంబర్‌ను కేటాయించారు.
ఏసీ చైర్ కార్ ఛార్జీ..
సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ.520, ఖమ్మం రూ.750, విజయవాడ రూ.905, రాజమండ్రి రూ.1,365, విశాఖ రూ.1,665గా నిర్ణయించారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రి రూ.625, విజయవాడ రూ.960, ఖమ్మం రూ.1,115, వరంగల్ రూ. 1,310, సికింద్రాబాద్ రూ. 1,720గా నిర్ణయించారు.
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 1,460, వరంగల్ రూ. 1,005, రాజమండ్రి రూ. 2,485, విశాఖపట్నం రూ. 3,120గా నిర్ణయించారు. అలాగే విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూ. 1,215, విజయవాడ, రూ. 1,825, ఖమ్మం రూ. 2,130, వరంగల్ రూ. 2,540, సికింద్రాబాద్ రూ. 3,170 గా నిర్ణయించారు.