అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్లో 71వ ఎడిషన్ మిస్ యూనివర్స్-2022 గ్రాండ్ ఫినాలే అంగరంగవైభవంగా జరిగింది. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది.
భారత్‌కు చెందిన పంజాబీ అందగత్తె, మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధు.. బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది. మిస్ యూనివర్స్-2022 పోటీలు అమెరికా కాలమానం ప్రకారం జనవరి 14న రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం జనవరి 15 ఉదయం 6.30 గంటలకు) ప్రారంభమయ్యాయి.
ఈ పోటీల గ్రాండ్ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్ పొదిగిన గౌన్‌ను ధరించి గాబ్రియేల్ వేదిక మీదకు వచ్చింది. ఈ విశ్వసుందరి పోటీల్లో వెనెజులా భామ అమండా దుడామెల్ మొదటి రన్నరప్‌గా, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన అండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
భారత్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివితా రాయ్ ఈసారి విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్నది. అయితే 80 దేశాల అందగత్తెలతో పోటీపడ్డ దివిత పై నుంచి 16వ స్థానానికి పరిమితమైంది. విజేత బొన్ని గాబ్రియేల్‌కు కిరీటం ధరింపజేసేందుకు వచ్చిన మాజీ విశ్వసుందరి హర్నాజ్ సంధు గ్రాండ్ ఫినాలే వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తన అందాలను మరింత ఇనుమడింపజేసే ఆకర్షణీయమైన నలుపు రంగు గౌనులో వచ్చి గాబ్రియేల్ నెత్తిన కిరీటం తొడిగింది. కాగా భారత్‌కు ఇప్పటివరకు మూడు సార్లు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారతీయ సుందరాంగులు సుస్మితాసేన్ (1994), లారాదత్తా (2000), హర్నాజ్ సంధు (2021) విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.